ENG vs PAK 1st Test: తీసుకున్న గోతిలోనే పడ్డారు: ముల్తాన్ టెస్టులో ఓటమి దిశగా పాకిస్థాన్

ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఫ్లాట్ వికెట్ తయారు చేసుకొని బ్యాటింగ్ లో అదరగొట్టింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో 556పరుగుల భారీ స్కోర్ కొట్టినా ఆ జట్టుకు ఓటమి తప్పేలా లేదు. తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో దారుణంగా విఫలమైన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో ఘోరంగా ఆడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. క్రీజ్ లో అఘా సల్మాన్(41), అమీర్ జమాల్ (27) ఉన్నారు.

పాకిస్థాన్ మరో 115 పరుగులు వెనకపడి ఉంది. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఐదో రోజు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ లో పాక్ ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కు 263 పరుగుల ఆధిక్యం సమర్పించుకున్న పాక్.. రెండో ఇన్నింగ్స్ లో పేలవంగా ఆడుతుంది. ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో ఒక్క బ్యాటర్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. పేలవ ఫామ్ లో ఉన్న బాబర్ అజామ్ 5 పరుగులే చేసి పెవిలియన్ కు వెళ్ళాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్, కార్స్ రెండో వికెట్లు పడగొట్టారు. జాక్ లీచ్ క్రిస్ ఓక్స్ తలో వికెట్ తీసుకున్నారు.     

ALSO READ : Women's T20 World Cup 2024: తండ్రి మరణం.. ఆసీస్‌తో కీలక పోరుకు పాకిస్థాన్ కెప్టెన్ దూరం

ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 823 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో 263 పరుగుల భారీ  ఆధిక్యాన్ని సంపాదించింది. హ్యారీ బ్రూక్ (317) ట్రిపుల్ సెంచరీ చేసి ఔటయ్యాడు. రూట్ 262 పరుగులు చేశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు ఏకంగా 452 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్ లో 556 పరుగులకు ఆలౌట్ అయింది.